: జాతీయ గీతాన్ని అవమానపరిచిన కర్ణాటక గవర్నర్
ఒక వైపు 'జనగణమన...' అని జాతీయ గీతం వినిపిస్తుంటే కర్ణాటక గవర్నర్ వాజూభాయ్ వాలా వేదికను వీడి కిందకు దిగడం తీవ్ర వివాదానికి దారితీసింది. కర్ణాటక హైకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్ర సింగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిన్న జరిగింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత జాతీయ గీతాన్ని వినిపించడం మొదలు పెట్టారు. వడివడిగా వేదిక దిగి వెళ్ళిపోతున్న వాజూభాయ్ వాలాకు అధికారులు విషయం వివరించగా ఆయన తిరిగి వేదికపైకి వచ్చి నిలబడ్డారు. పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు నిలబడి జాతీయ గీతానికి గౌరవం ఇస్తుండగా, ఆయన వేదిక దిగిన దృశ్యాలు అన్ని టీవీ చానల్స్ ప్రముఖంగా చూపాయి. దీంతో ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై రాజ్ భవన్ ఎటువంటి ప్రకటనా వెలువరించలేదు.