: ఏపీలో ‘రాజధాని పన్ను’... చంద్రబాబు అనుమతిస్తే తక్షణమే అమల్లోకి!
రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని లేక నానా అగచాట్లు పడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ఓ పన్నును ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ‘రాజధాని పన్ను’ పేరిట కొత్తగా రూపుదిద్దుకున్న ఈ పన్నుకు సంబంధించిన కసరత్తును పూర్తి చేసిన అధికారులు, ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు. సీఎం నారా చంద్రబాబునాయుడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ పన్నును అమల్లోకి తీసుకువచ్చేందుకు కార్యరంగం సిద్ధం చేశారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న వ్యాట్ కు అదనంగా 1 నుంచి 2 శాతం పన్నును వసూలు చేయాలన్న ప్రతిపాదనలు సిద్ధమయ్యాయట. సెస్ పేరిట వసూలు చేసే ఈ పన్నును కేవలం రాజధాని నిర్మాణం కోసం మాత్రమే ఖర్చు చేస్తే, ప్రజల నుంచి కూడా ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం కాదని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు.