: నటనలో జగన్ పండిపోయారు... రాజమౌళో, వివి వినాయకో సూపర్ డూపర్ హిట్ సినిమా తీయొచ్చు :గోరంట్ల
ఏపీ శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న సీబీఐ కేసుల వ్యవహారం చర్చించేందుకే ఢిల్లీ వెళ్లీ ప్రధానిని, కేంద్ర మంత్రులను కలుస్తున్నారని అధికారపక్ష సభ్యులు వ్యాఖ్యానించారు. దాంతో జగన్ ఆవేశంగా మాట్లాడారు. వెంటనే టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేచి జగన్ ను ఎద్దేవా చేశారు. తండ్రి చాటు బిడ్డగా చాలా తక్కువ సమయంలో చాలా నేర్చుకున్నారన్నారు. ఎంతసేపటికీ రెండు పార్టీలు (టీడీపీ,బీజేపీ) విడిపోవాలంటున్నారని, అంతే కానీ, రాష్ట్రానికి రావాల్సిన వాటికోసం ఆలోచించడం లేదని అన్నారు. అసలు ఇవాళ అవినీతి, నటనలో జగన్ పండిపోయారని, దాన్ని చూసేందుకు దర్శకులు రాజమౌళో, వివి వినాయకో ఇక్కడికి రావాలన్నారు. వాళ్లైతే ఆయనను (జగన్) పెట్టి ఓ సూపర్ డూపర్ హిట్ సినిమా తీస్తారని వ్యంగ్యంగా అన్నారు. ఈ సమయంలో సభలో మరింత గందరగోళం చోటుచేసుకుంది.