: బ్రిటన్ పార్లమెంటులో అనుకోని అతిథులు... ఎంపీల ఇక్కట్లు!
ఎన్నో ప్రపంచదేశాల పార్లమెంట్లకు స్ఫూర్తిగా నిలిచిన బ్రిటన్ పార్లమెంటు ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుంది. ఓ వైపు ఎలుకలు పిలవని పేరంటంలా వచ్చి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి! టీ తాగేందుకు ప్రత్యేక రూం వైపు వెళితే అక్కడ కప్పులు, తదితర వస్తువులపై స్వైర విహారం చేస్తుంటాయి. మరోవైపు, భవనాల సీలింగ్ పెచ్చులూడుతున్నాయి. వర్షం కురిస్తే ఇక చెప్పనక్కర్లేదు! నీళ్లు లోపలికి చుక్కలుచుక్కలుగా పడుతుంటాయి. ఆ సమయంలో ఎంపీలు చెత్త బుట్టలను నీళ్లు పడే ప్రదేశాల్లో ఉంచుతారు. ఇక, వాతావరణ కాలుష్యంతో విలువైన కట్టడాలు సైతం మసిబారిపోతున్నాయి. ఈ సమస్యలను తీవ్రంగా పరిగణిస్తున్న కొందరు సభ్యులు, ఎలుకల పనిబట్టేందుకు సమీప జంతు సంరక్షణ కేంద్రం నుంచి ఓ పిల్లిని అద్దెకు తీసుకోవాలని సూచిస్తున్నారు. దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ స్థాయిలో ఉందో! భవంతుల మరమ్మతు పనుల కోసం పార్లమెంటరీ అధికార వర్గాలు ప్రత్యేకంగా ఓ కమిటీని నియమించాయి.