: కొత్త సభ్యుడన్న జానా... సంపత్ సస్పెన్షన్ పై వెనక్కు తగ్గిన టీ సర్కారు


తెలంగాణ సభలో కలకలం రేపిన 'జాతీయ గీతానికి అవమానం' అంశంలో కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సంపత్ కుమార్ తృటిలో సస్పెన్షన్ వేటు నుంచి తప్పించుకున్నారు. టీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం మాట్లాడిన సంపత్ కుమార్, నాటి తన చర్యను సమర్ధించుకునే యత్నం చేశారు. ఈ క్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేస్తూనే నాడు అధికార పార్టీ సభ్యుల గందరగోళమే జాతీయ గీతానికి అవమానం జరిగేలా ఉసిగొల్పిందని ఆరోపించారు. ఈ క్రమంలో స్పీకర్ పలుమార్లు చేసిన విజ్ఞప్తులను సంపత్ పట్టించుకోలేదు. దీంతో, సంపత్ కుమార్ ను కూడా సస్పెండ్ చేసేందుకు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించేందుకు సిద్ధమయ్యారు. తీర్మానాన్ని చదవడం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న టీ సీఎల్పీ నేత జానారెడ్డి... సంపత్ కుమార్ కొత్త సభ్యుడు కాబట్టి, అతడికి మరింత సమయం ఇవ్వాలని స్పీకర్ ను కోరారు. అంతేగాక, చెప్పాల్సిన అంశాన్ని సూటిగా చెప్పమని సొంత పార్టీ సభ్యుడికి మొట్టికాయలేశారు. దీంతో అధికార పక్షం పట్టు సడలించింది. జానారెడ్డి సూచనతో సర్దుకున్న సంపత్ కుమార్ క్షమాపణ చెప్పి సస్సెన్షన్ వేటు నుంచి తప్పించుకున్నారు.

  • Loading...

More Telugu News