: స్పీకర్ పై మరోమారు జగన్ ఫైర్... సభా సమయం కుదింపుపై ప్రశ్నల వర్షం
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పీకర్ కోడెల శివప్రసాద్ పై మరోమారు విరుచుకుపడ్డారు. సమావేశాలను కుదించడం కుదరదన్న జగన్... ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతుంటే, వారి మైకులు ఎలా కట్ చేస్తారంటూ కోడెలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర స్వరంతో జగన్ దాడి చేయడంతో స్పీకర్ ఒకింత షాక్ కు గురయ్యారు. గడచిన సమావేశాల్లో జగన్, స్పీకర్ స్థానంపై చేసిన వ్యాఖ్యలను కోడెల తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. అయితే తన వైఖరిని ఏమాత్రం మార్చుకోని జగన్, తిరిగి మునుపటి తీరులోనే స్పీకర్ స్థానంపై విరుచుకుపడ్డారు. సభా సమయాన్ని ఎలా కుదిస్తారంటూ జగన్ తీవ్ర స్వరంతో చేసిన వ్యాఖ్యలతో కోడెల నిశ్చేష్టులయ్యారు. పరిస్థితిని గమనించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కల్పించుకుని బీఏసీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు.