: పాక్ మాజీ పేసర్ సలహా ఇచ్చాడు... మనవాడు పాటించాడు!
ఈ వరల్డ్ కప్ లో టీమిండియా బౌలింగ్ విభాగంలో పేసర్ మహ్మద్ షమి మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అంతకుముందు ఆసీస్ పర్యటనలో ఏమంత ఆకట్టుకోని ఈ బెంగాల్ ఫాస్ట్ బౌలర్, మెగా ఈవెంట్లో మాత్రం ప్రత్యర్థి బ్యాట్స్ మెన్ ను సమర్థంగా కట్టడి చేస్తున్నాడు. తాను ఫాం అందిపుచ్చుకోవడానికి పాకిస్థాన్ మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తరే కారణమంటున్నాడు షమి. అతనిచ్చిన సలహాతోనే లయ దొరకబుచ్చుకున్నానని పేర్కొన్నాడు. "ఇటీవలే షోయబ్ భాయ్ తో మాట్లాడాను. రనప్ తగ్గించుకోమని సూచించాడు. పెద్దపెద్ద అంగలకు బదులు చిన్న అంగలతోనే క్రీజు వద్దకు చేరుకోవాలని సలహా ఇచ్చాడు. ఆ సలహా ఫలించింది. కొత్త రనప్ ఎంతో సౌకర్యవంతంగా ఉంది. పేస్ రాబట్టగలుగుతున్నాను" అని వివరించాడు. విండీస్ తో మ్యాచ్ లో షమి 3 వికెట్లు తీయడం తెలిసిందే. ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ క్వార్టర్స్ బెర్తు ఖాయం చేసుకుంది.