: లోహ విహంగం మాయమై నేటికి ఏడాది!
అదేమీ చిన్న వస్తువు కాదు. భారీ విమానం. సరిగ్గా సంవత్సరం క్రితం 239 మందితో ప్రయాణిస్తూ మాయమైపోయింది. ప్రపంచంలోని అత్యాధునిక సాంకేతిక పరికరాలు ఆ విమానం ఎక్కడ ఉందన్న సంగతిని గుర్తించలేకపోయాయి. విమాన శిథిలాలు కాదుకదా, దానికి సంబంధించిన చిన్న రేకుముక్క కూడా దొరకలేదు. వరల్డ్ ఎయిర్ లైన్ హిస్టరీలో అత్యంత విషాదకర సంఘటనగా చరిత్రకెక్కిన దుర్ఘటనలో విమానం కూలిపోయిందని భావిస్తున్న అనుమానిత ప్రాంతాన్ని అణువణువునా శోధిస్తున్నా, సమయం ఏడాది కావడం మినహా, ఏ ఆధారమూ లభించలేదు. ప్రయాణికుల బంధువులు మాత్రం విమానం కూలిపోయిందన్న విషయం ఆధారాలతో నిర్ధారణ కాకుండా ప్రయాణికులు చనిపోయారని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. విమానాన్ని హైజాక్ చేశారనీ, తమవాళ్లను ఎవరో కిడ్నాప్ చేశారని నమ్ముతున్న వారూ వున్నారు. కాగా, ఈ విమానం వెతుకులాట నిమిత్తం ఇప్పటివరకూ 120 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లను (సుమారు 582 కోట్లు) మలేషియా, ఆస్ట్రేలియా ప్రభుత్వాలు వెచ్చించాయి. మొత్తం 23 వేల చదరపు మైళ్లు వెతకాలని లక్ష్యంగా పెట్టుకున్న మలేషియా అధికారులు, ప్రస్తుతానికి 10 వేల మైళ్లు వెతికారు. మిగిలిన ప్రాంతాన్ని మేలోగా పూర్తి చేసి విమానాన్ని కనిపెడతామని మాత్రం చెబుతున్నారు.