: నాగాలాండ్ మహిళ అత్యాచారానికి గురికాలేదన్న వైద్య నివేదిక... నిరపరాధిని పొట్టనబెట్టుకున్న ప్రజల ఆవేశం


ప్రజల ఆవేశం, ఆగ్రహాలకు ఒక నిరపరాధి బలయ్యాడు. రెండు రోజుల క్రితం నాగాలాండ్ లోని దిమాపూర్ లో అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ, వేల సంఖ్యలో ప్రజలు జైలుపై దాడిచేసి నిందితుడిని ఘోరంగా చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఫిర్యాదు చేసిన యువతిపై అసలు అత్యాచారమే జరగలేదని వైద్య నివేదిక వెల్లడి కావడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో కర్ఫ్యూ అమలులో వుండగా, తాజా నివేదికతో రెండు వర్గాల మధ్య మరింత ఘర్షణ జరగవచ్చని భావించిన అధికారులు మరింత భద్రతను పెంచారు. బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వైద్య నివేదిక పేర్కొందని పోలీసులు తెలిపినట్టు మృతుడి సోదరుడు జమాలుద్దీన్ ఖాన్ వాపోయాడు. మృతుడి భార్యకు చెల్లెలి వరసయ్యే యువతి పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేసిందని, అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఆటవిక రాజ్యాన్ని నడుపుతోందా? అని ప్రశ్నించాడు. తన సోదరుడిని బంగ్లాదేశీ అని ఆరోపిస్తూ, దారుణంగా హింసించి చంపారని ఆరోపించాడు. తనతోపాటు, తన మరో సోదరుడు సైన్యంలో పనిచేస్తున్నాడని, ఇంకో సోదరుడు 1999 కార్గిల్ యుద్ధంలో చనిపోయాడని గుర్తు చేసిన ఆయన, తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్సులో పనిచేసాడని తెలిపాడు. తాము బంగ్లాదేశీయులం అయితే ఉద్యోగాలు ఎందుకు వస్తాయని, తమది అస్సాంలోని కరీంగంజ్ జిల్లా అని తెలిపాడు.

  • Loading...

More Telugu News