: కిందపడేసి తొక్కారు... అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే: ఎర్రబెల్లి
అసెంబ్లీ చరిత్రలో ఈ రోజు బ్లాక్ డే అని టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సభ్యులు ప్రకాశ్ గౌడ్, నాగేశ్వరరావును టీఆర్ఎస్ నేతలు కిందపడేసి తొక్కారని... ఈ ఘటన అసెంబ్లీ చరిత్రలో ఓ మాయని మచ్చ అని మండిపడ్డారు. అసెంబ్లీలో కొట్టుకోవడం ఇంతవరకు జరగలేదని అన్నారు. గవర్నర్, ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇలా జరగడం దారుణమని తెలిపారు. తెలంగాణ ద్రోహులంతా మంత్రులుగా మారారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులపై దాడులకు పాల్పడిన తలసాని శ్రీనివాస్ యాదవ్, తుమ్మల నాగేశ్వరరావులకు మంత్రి పదవులు ఇచ్చారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకునేంత వరకు తమ నిరసన ఆగదని హెచ్చరించారు. పార్టీ మారిన వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క హామీని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు.