: ఫ్యామిలీ బడ్జెట్ అయిపోయింది, దొరల బడ్జెట్ రాబోతోంది: టీఆర్ఎస్ పై రేవంత్ విసుర్లు
టీఆర్ఎస్ ప్రభుత్వంపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. రానున్న తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తమ వైఖరి ఎలా ఉండబోతోందో తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే ప్రభుత్వంపై నిరసన తెలుపుతామని చెప్పారు. గతంలో వచ్చిన తొలి బడ్జెట్ కేసీఆర్ ఫ్యామిలీ బడ్జెట్ అయితే, ఇప్పుడు రానున్న బడ్జెట్ దొరల బడ్జెట్ అని విమర్శించారు. పార్టీలు మారిన జంప్ జిలానీలపై వేటు వేయకుండా, రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆదాయం ఎంత ఉందన్నది పరిగణనలోకి తీసుకోకుండా... లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామంటున్నారని ఎద్దేవా చేశారు. సమావేశాల్లో అన్ని అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.