: ఎవర్నీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు... దిగజారుడు రాజకీయాలకు పాల్పడను: పవన్ కల్యాణ్
నవ్యాంధ్ర రాజధాని భూముల విషయంలో తనకు ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, బాధ్యతను మాత్రమే గుర్తు చేశానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాగని దిగజారుడు రాజకీయాలకు పాల్పడనన్నారు. ప్రజలు పిలిస్తేనే తాను రాజధాని ప్రాంతానికి వెళ్లానని చెప్పారు. పాలకుల విధివిధానాల్లో లోపం ఉంటే భవిష్యత్ తరాలపై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. అసలు పెద్ద మనుషల ఒప్పందాన్ని సరిగా అమలు చేయనందునే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందని పేర్కొన్నారు. విభజన సమయంలోనే నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీని కలసి సమస్యలు వివరించానన్నారు. అన్యాయం జరిగిందని చెప్పానని, సమాజానికి ప్రశాంతత కల్పించాలని కోరానని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని మోదీకి అప్పుడే చెప్పానన్నారు. అభివృద్ధికోసం గ్రామాలను చంపకూడదని, రైతు కష్టాలు తనకు తెలుసునని పవన్ అన్నారు.