: బాబులూ... మా వద్దకు రాకండి!: చంద్రబాబుపై నమ్మకముందంటున్న తుళ్లూరు రైతులు!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని తుళ్లూరు ప్రాంత రైతులు తమ ప్రాంత పర్యటనకు రావొద్దని రాజకీయ నేతలు, ప్రముఖులను కోరుతున్నారు. అసలు విషయం పక్కనబెట్టి, ఆందోళనలకు గురిచేసే అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తూ రైతులను అయోమయంలోకి నెడుతున్న సదరు పర్యటనలను ఇకపై అనుమతించబోమని కూడా వారు తెగేసి చెబుతున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో అక్కడి రైతులు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, ఏమాత్రం సంబంధం లేని వ్యవహారంలో తలదూరుస్తున్న నేతలు, తమను అయోమయంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం తాము ఇష్ట పూర్వకంగానే భూములను ప్రభుత్వానికి అప్పగించామని చెప్పిన రైతులు, ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుందని అసలు ఎవరు చెప్పారంటూ పవన్ కల్యాణ్ లాంటి వారు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుపై తమకు నమ్మకముందని, తమకు ఏదైనా కావాలంటే ఆయన వద్దకే నేరుగా వెళతామని వారు చెబుతున్నారు. తమను అయోమయంలోకి నెట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న నేతలు ఇకపై తమ ప్రాంతానికి రావొద్దని వారు కోరారు.