: కరీబియన్లతో టీమిండియా పోరు నేడే... అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్న మ్యాచ్!
వరల్డ్ కప్ మెగా టోర్నీలో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ చాంపియన్ భారత్, వెస్టిండీస్ తో తలపడనుంది. గ్రూప్- బీలో భాగంగా ఆస్ట్రేలియా నగరం పెర్త్ లో నేటి మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతున్న ఈ మ్యాచ్ పట్ల ఒక్క భారత్ లోనే కాక ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇరు జట్లలో డబుల్ సెంచరీ వీరులుండటం గమనార్హం. భారత్ తరఫున రెండు సార్లు డబుల్ సెంచరీలు సాధించిన స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, కిందటి మ్యాచ్ లో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక నిన్నటిదాకా ఫామ్ లేక కరీబియన్ జట్టును సందిగ్ధంలో పడేసిన క్రిస్ గేల్ కూడా వరల్డ్ కప్ లో తొలి డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. దీంతో విజయంపై రెండు జట్లు పూర్తి విశ్వాసంతో బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే మూడు విజయాలు నమోదు చేసిన టీమిండియా, ఈ మ్యాచ్ లోనూ నెగ్గి క్వార్టర్ ఫైనల్ లో బెర్తు ఖరారు చేసుకోవాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే నాలుగు మ్యాచ్ లు ఆడిన కరీబియన్లు రెండింటిలో విజయం సాధించి మరో రెండింటిలో ఓటమి పాలయ్యారు. క్వార్టర్ ఫైనల్ రేసులో నిలవాలంటే, నేటి మ్యాచ్ లో గెలిచి తీరాల్సి ఉంది. విజయం తమదేనని వెస్టిండీస్ కెప్టెన్ స్యామీ ఇప్పటికే విశ్వాసం వ్యక్తం చేస్తూ ‘‘టీమిండియాకు హోలీ సంబరాలు... మాకు గెలుపు సంబరాలు’’ అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ప్రత్యర్థిని ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసంటూ టీమిండియా కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ చెబుతున్నాడు.