: ఈసారి దివాకర్ ట్రావెల్స్ బస్సు వంతు... ఇంజిన్ లో మంటలు, తప్పిన ముప్పు
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల దుర్ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ట్రావెల్స్ యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అసలు ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించాలంటేనే జనం వణికిపోతున్నారు. ఇలాంటి ఘటనే రాత్రి మహబూబ్ నగర్ జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ సమీపంలో చోటుచేసుకుంది. నిండా ప్రయాణికులతో హైదరాబాదు నుంచి తిరుపతి బయలుదేరిన దివాకర్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రయాణికులు ఉరుకులు పరుగులు పెట్టారు. మంటలను గుర్తించిన డ్రైవర్ బస్సును నిలిపేసిన మరుక్షణమే ప్రయాణికులు కిందకు దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్సు నుంచి కిందకు దిగిపోయిన ప్రయాణికులు మరో బస్సు కోసం దాదాపు 3 గంటల పాటు రోడ్డుపైనే జాగారం చేయాల్సి వచ్చింది.