: స్కాట్లాండ్ ఓటమి ... ఆరు వికెట్లతో బంగ్లాదేశ్ విజయం
వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా కొద్దిసేపటి క్రితం ముగిసిన లీగ్ మ్యాచ్ లో పసికూన స్కాట్లాండ్ పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్, స్కాట్లాండ్ కు బ్యాటింగ్ అప్పగించి ఫీల్డిండ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోరు చేసింది. స్కాట్లాండ్ ఓపెనర్ కైలీ కోయెట్జర్ బంగ్లా బౌలర్లను ఊచ కోత కోశాడు. 134 బంతులను ఎదుర్కొన్న అతడు నాలుగు సిక్స్ లు, 17 ఫోర్లతో 116.14 స్ట్రైక్ రేటుతో 156 పరుగులు చేశాడు. ఆ తర్వాత 319 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 48.1 ఓవర్లలోనే 322 పరుగులు సాధించి జయకేతనం ఎగురవేసింది. ఓపెనర్ సౌమ్య సర్కార్ (2) మినహా మిగిలిన బంగ్లా బ్యాట్స్ మెన్లందరూ తమ బ్యాట్లను ఝుళిపించారు. ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ 95 బంతుల్లో 95 పరుగులు చేశాడు. ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. దీంతో నాలుగు వికెట్లను కోల్పోయిన బంగ్లా అవలీలగా విజయలక్ష్యాన్ని చేరుకుంది.