: నూటొక్క హామీల్లో కేసీఆర్ నెరవేర్చింది మూడే... పదడుగుల చార్టర్ విడుదల చేసిన షబ్బీర్ అలీ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ శాసనమండలి పక్ష ఉపనేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు, అధికారం చేపట్టిన తర్వాత సీఎం కేసీఆర్ మొత్తం నూటొక్క హామీలను గుప్పించారన్న షబ్బీర్, వాటిలో కేవలం మూడంటే మూడింటిని మాత్రమే నెరవేర్చారని ఆరోపించారు. ఇక మరో 18 హామీలను పాక్షికంగా అమలు చేసిన కేసీఆర్, మిగిలిన వాటి అమలును పట్టించుకున్న పాపాన పోలేదని నిన్న గాంధీ భవన్ సాక్షిగా షబ్బీర్ అలీ విరుచుకుపడ్డారు. కేసీఆర్ గుప్పించిన హామీలకు సంబంధించి పదడుగుల చార్టర్ (ప్రామిసెస్ ట్రాకర్)ను ఆయన విడుదల చేశారు. అంతేకాక కేసీఆర్ పేర్కొన్న వాటిలో ప్రధాన హామీలను మాత్రమే తాము పరిగణనలోకి తీసుకున్నామని చెప్పిన షబ్బీర్, మొత్తం హామీలను చేరిస్తే పదడుగుల చార్టర్ కూడా సరిపోదని వ్యాఖ్యానించారు. బర్తరఫ్ కు గురైన డిప్యూటీ సీఎం రాజయ్యపై వచ్చిన ఆరోపణలపై స్పష్టత ఇవ్వని కేసీఆర్, మంత్రి జగదీశ్ రెడ్డిపై వెల్లువెత్తుతున్న ఆరోపణపై మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.