: నిర్భయ నేరస్థుడి ఇంటర్వ్యూపై రాజ్యసభ ఖండన... రాజ్ నాథ్ సింగ్ వివరణ
నిర్భయపై రూపొందించిన డాక్యుమెంటరీని, ఈ కేసులో దోషి ముఖేష్ సింగ్ ఇంటర్వ్యూను రాజ్యసభ ముక్తకంఠంతో ఖండించి, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై సభలో జేడీయూ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టగా, డాక్యుమెంటరీపై తీసుకున్న చర్యలను సభకు తెలపాలని ఛైర్మన్ హమీద్ అన్సారీ సూచించారు. దాంతో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సభకు వివరణ ఇచ్చారు. జైలులో ఇలాంటి ఇంటర్వ్యూలకు అనుమతులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఈ ఘటన బాధ కలిగించిందన్నారు. "సామాజిక ప్రయోజనం కోసమే ఇంటర్వ్యూ చేసేందుకు అనుమతి ఇచ్చాము కానీ, కమర్షియల్ ప్రయోజనం కోసం కాదు. నిబంధనలు ఉల్లంఘించారని జైలు అధికారులకు తెలియగానే లీగల్ నోటీసు జారీ చేశాము. నిబంధనలతోనే డాక్యుమెంటరీ రూపొందించేందుకు అనుమతించాము" అని రాజ్ నాథ్ వెల్లడించారు. డాక్యుమెంటరీ ప్రసారంపై ఆంక్షలు విధిస్తున్నట్టు రాజ్యసభకు హోంమంత్రి హామీ ఇచ్చారు.