: ఢిల్లీలో ప్రారంభమైన స్పెక్ట్రమ్ వేలం
ఢిల్లీలో స్పెక్ట్రమ్ వేలం ప్రారంభమైంది. ఈ వేలంలో ఎనిమిది సంస్ధలు పాల్గొన్నాయి. ఈ వేలం ద్వారా దాదాపు రూ.82,000 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దేశంలోని 22 టెలికాం సర్కిళ్లలోని 17 సర్కిళ్లలో మొత్తం నాలుగు బ్యాండ్ల 2జీ, 3జీ స్పెక్ట్రమ్ ను టెలికాం శాఖ వేలం వేస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతా భారీ స్థాయిలో జరుగుతున్న ఈ వేలంలో స్పెక్ట్రమ్ ను దక్కించుకునేందుకు ఎయిర్ టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్ సహా ఎనిమిది ప్రముఖ టెలికాం సంస్థలు పోటీ పడుతున్నాయి. ఇందులో 3జీ టెలికాం సేవలకు ఉపయోగపడే 2100 మెగాహెర్ట్జ్ ప్రీమియం స్పెక్ట్రమ్ వేలం ద్వారానే రూ.17,555 కోట్లు సమకూరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 2జీ సేవలకు ఉపయోగపడే 800, 900, 1800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ వేలంతో మరో రూ.64,840 కోట్ల ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. గతంలో జరిగిన వేలం ద్వారా పొందిన ఈ స్పెక్ట్రమ్ గడువు మార్చి, 2016తో ముగియనుండటంతో అప్పట్లో స్పెక్ట్రమ్ పొందిన కంపెనీలు కూడా ఈ వేలంలో పాల్గొంటున్నాయి.