: విద్యుత్ లో తెలంగాణకు వాటా ఇచ్చేది లేదు... ప్రాధికార సంస్థకు తేల్చిచెప్పిన ఏపీ
తన భూభాగంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో తెలంగాణకు వాటా ఇచ్చే ప్రసక్తే లేదని ఏపీ సర్కారు తేల్చిచెప్పింది. ఇప్పటికే పలు వేదికలపై ఈ విషయాన్ని వెల్లడించిన ఏపీ ప్రభుత్వం, నిన్న కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) సమావేశంలోనూ మరోమారు తన వైఖరిని స్పష్టం చేసింది. సీఈఏ చైర్ పర్సన్ మేజర్ సింగ్ నేతృత్వంలో నిన్న జరిగిన సమావేశానికి ఏపీ తరఫున జెన్ కో సీఎండీ విజయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టం ప్రకారం కృష్ణపట్నం, హిందూజా ప్రాజెక్టుల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ లో తమకు వాటా దక్కాల్సిందేనని తెలంగాణ అధికారులు వాదించారు. దీనికి స్పందించిన విజయానంద్, సదరు ప్రాజెక్టుల విద్యుత్ లో తెలంగాణకు వాటా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. దీంతో జోక్యం చేసుకున్న మేజర్ సింగ్, ఆది నుంచి జరుగుతున్న పరిణామాలపై రెండు రాష్ట్రాలు ఆధారాలతో సవివర నివేదికలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.