: హంతకుడి ఇంటర్వ్యూకు ఎలా అనుమతిచ్చారు?: మహిళా సంఘాల ఆగ్రహం


నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు దోషి ముఖేష్ కుమార్ ఇంటర్వ్యూ ఉదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. మార్చి 8 సందర్భంగా బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చాడని చెబుతున్న ఒక వీడియో సోషల్ మీడియాలో హల్ చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూలో అత్యాచారాలకు అమ్మాయిలదే ప్రధాన బాధ్యత అంటూ ముఖేష్ చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. జైలు శిక్ష వేసినా నిర్భయ దోషి మనస్తత్వంలో మార్పురాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన వారు, జైల్లో ఉన్న దోషిని ఇంటర్య్వూ చేసేందుకు ఎలా అనుమతిచ్చారంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో హోం శాఖ రంగంలోకి దిగింది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తీహార్ జైలు అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఏ పరిస్థితుల్లో అతని ఇంటర్య్వూకు అనుమతిచ్చారంటూ జైలు డీజీని ప్రశ్నించారు. కాగా, దీనిపై నిర్భయ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ఇంటర్వ్యూపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భారత చట్టాల్లోని లోపాల వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇక అమ్మాయిలకు రక్షణ ఎక్కడుందని నిర్భయ తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీ తీసిన వ్యక్తి నిబంధనలను వ్యతిరేకించారని, ఈ ఇంటర్వ్యూ బైటపెట్టే ముందు ఆ వీడియోను తమకు చూపించలేదని తీహార్ జైలు అధికారులు హోం మంత్రిత్వశాఖకు తెలిపారు. దీనిని కేంద్రం పరిశీలిస్తోంది.

  • Loading...

More Telugu News