: పాక్ తో మైత్రీబంధంపై ముందడుగు
పాకిస్థాన్ తో మరింత బలమైన స్నేహబంధం ఏర్పడే దిశగా కీలక అడుగు పడింది. నేటి ఉదయం ఇస్లామాబాద్ చేరుకున్న విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జయశంకర్, పాకిస్థాన్ తరపున ఐజాజ్ అహ్మద్ లు కీలక చర్చలు ప్రారంభించారు. సుమారు 7 నెలల క్రితం సార్క్ సమావేశాల సందర్భంగా ఇరు దేశాల ప్రధానులూ కలసి విదేశాంగ శాఖ కార్యదర్శి స్థాయిలో చర్చలు మొదలుపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జయశంకర్ రెండు రోజుల పర్యటన నిమిత్తం పాకిస్థాన్ కు పయనమయ్యారు. కాగా, వీరి మధ్య పలు అంశాలపై చర్చలు జరగనున్నట్టు సమాచారం. 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన నుంచి అంతర్జాతీయ సరిహద్దుల్లో, వాస్తవాదీన రేఖ వద్ద ఉద్రిక్తతలు తగ్గించడం, పరస్పర విమర్శలు ఆపడం వంటి అంశాలపై చర్చలు జరగవచ్చని పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. కాగా, ఇస్లామాబాద్ చేరుకున్న జయశంకర్ కు అక్కడి ఇండియన్ హై కమిషనర్ రాఘవన్ స్వగతం పలికారు. రేపు ఆఫ్ఘనిస్తాన్ కు బయలుదేరి వెళ్లనున్న రాఘవన్ అంతకుముందే పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తో కూడా చర్చలు జరపనున్నారు.