: పార్టీలో జరుగుతున్న పరిణామాలపై తీవ్రంగా బాధపడ్డా: కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీలో తలెత్తిన అంతర్గత సంక్షోభంపై పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పార్టీలో ప్రస్తుతం జరుగుతున్న దానిపట్ల తీవ్రంగా కలత చెందానని, చాలా బాధకలిగించిందంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు. "పార్టీలో నెలకొన్న పరిణామాలు చాలా బాధ కలిగించాయి. ఢిల్లీ ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకానికి ద్రోహం చేసినట్టు ఉంది" అని కేజ్రీ ట్వీట్ లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను కలుగజేసుకోనన్నారు. కేవలం ఢిల్లీ పాలనపైనే దృష్టిపెడతానని చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కేంద్రంగా నడిచిన ప్రచారంపై సీనియర్ నేత యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ లు లేఖలో ప్రశ్నించడంతో విభేదాలు వచ్చాయి. దాంతో ఈ నెల 5న పార్టీ జాతీయ కార్యవర్గం సమావేశమై సమస్యలపై చర్చించనుంది.