: పులిని పెంచుకుంటా... అటవీ శాఖకు మధ్యప్రదేశ్ మహిళా మంత్రి దరఖాస్తు!


థాయ్ లాండ్ సహా కొన్ని ఆసియా దేశాల్లో పులులను పెంచుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్కడ పులులు, సింహాలను నిశ్చింతగా పెంచుకోవచ్చు. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన మహిళా మంత్రి కుసుమ్ మెహ్ దెలే, ఆ దేశవాసుల తరహాలో తానూ ఓ పులిని పెంచుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మన దేశంలో అందుకు చట్టాలు అనుమతించవు కదా. ఈ విషయంపై తర్జనభర్జన పడ్డ సదరు మంత్రి, ప్రభుత్వ అనుమతి తీసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నారు. వెనువెంటనే కేంద్ర అటవీ శాఖకు లేఖ రాశారు. అయితే కేంద్రం నుంచి స్పందన రాలేదట. గతేడాది సెప్టెంబర్ లో కుసుమ్ రాసిన లేఖను తాజాగా భోపాల్ కు చెందిన సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు అజయ్ దూబే వెలికితీశారు. పులులను పెంచుకునే వెసులుబాటు ఉన్న కారణంగా థాయ్ లాండ్ లాంటి దేశాల్లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్న కుసుమ్, మన దేశంలో ఆ తరహా సౌకర్యం లేని కారణంగానే నానాటికీ పులుల సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో పులుల సంఖ్య తగ్గిపోతోందన్న భావనతోనే కుసుమ్, కేంద్రం చర్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ ఈ లేఖ రాశారట. ఇదిలా ఉంటే, ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పన్నా నియోజకవర్గంలోని అభయారణ్యంలో పులుల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిందని అజయ్ దూబే చెబుతున్నారు.

  • Loading...

More Telugu News