: అల్లుడిని హీరోగా చూసేందుకు... హైదరాబాదు శివారు బ్యాంకుల్లో అరవ ముఠా నేత స్వైర విహారం
హైదరాబాదు శివారులోని పలు బ్యాంకుల్లో జరిగిన వరుస చోరీలను ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. తమిళనాడుకు చెందిన ఓ అరవ ముఠా ఈ నేరాలకు పాల్పడిందని హైదరాబాదు పోలీసులు తేల్చారు. ఘట్ కేసర్, జీడిమెట్ల పరిధిలోని గ్రామీణ బ్యాంకుల్లో జరిగిన చోరీలకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితులను గుర్తించారు. పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం... తమిళనాడు రాజధాని చెన్నైకి చెందిన ఓ వ్యక్తి తన అల్లుడిని సినిమా హీరోను చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం చలనచిత్ర దర్శకులు, నిర్మాతల వద్దకెళ్లాల్సిన అతడు, అందుకు విరుద్ధంగా తానే ఓ చిత్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు కోసం బ్యాంకు చోరీలే బెటరనుకున్నాడు. చెన్నై పరిసరాల్లో అయితే త్వరగా పట్టుబడతాననుకున్నాడు. చోరీలకు హైదరాబాదును ఎంపిక చేసుకున్నాడు. కొంతమందితో కలిసి ఓ ముఠాను (అరవ ముఠా)ను ఏర్పాటు చేశాడు. ముఠాతో కలిసి దర్జాగా కారులో హైదరాబాదు వచ్చాడు. నగర శివారులోని మూడు బ్యాంకుల్లో వరుస చోరీలకు పాల్పడ్డాడు. రూ.5 కోట్ల మేర డబ్బును బ్యాగుల్లో సర్దేశాడు. వచ్చిన కారులోనే తిరిగి వెళ్లాడు. సీసీ కెమెరా ఫుటేజీల్లో అరవ ముఠా నేతను గుర్తించిన పోలీసులు, చెన్నైలోని అతడి ఇంటిని కూడా గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు చెన్నై బయలుదేరాయి.