: ఇంగ్లండ్ ను చిత్తు చేసిన శ్రీలంక... తొమ్మిది వికెట్ల తేడాతో లంకేయుల ఘన విజయం
వరల్డ్ కప్ లో భాగంగా నేటి తెల్లవారుజామున జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ పై శ్రీలంక ఘన విజయం సాధించింది. వెల్లింగ్టన్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన మ్యాచ్ లో సింగిల్ వికెట్ కోల్పోయిన శ్రీలంక జట్టు, ఆంగ్లేయులు పెట్టిన భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 309 పరుగులు సాధించింది. లంక బౌలర్లపై విరుచుకుపడ్డ ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ జో రూట్ 108 బంతుల్లో 121 పరుగులు చేశాడు. దీంతో ఇంగ్లండ్ భారీ విజయ లక్ష్యాన్ని లంక ముందుంచింది. అనంతరం 310 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన లంక బ్యామ్స్ మెన్ ఆది నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓపెనర్ గా బరిలోకి దిగిన లాహిరు తిరిమన్నే (139) చివరి దాకా కొనసాగి సెంచరీతో చెలరేగాడు. అతడితో కలిసి లంక ఇన్నింగ్స్ ను ప్రారంభించిన తిలకరత్నే దిల్షాన్ (44) జట్టు స్కోరు సెంచరీ మార్కు తాకగానే ఔటయ్యాడు. దిల్షాన్ నిష్క్రమణతో రంగంలోకి దిగిన లంక స్టార్ బ్యాట్స్ మన్ కుమార్ సంగక్కర 86 బంతుల్లోనే 117 పరుగులు రాబట్టాడు. దీంతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయిన లంకేయులు ఇంగ్లండ్ పై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించారు.