: మోదీని కలవాలని నిర్ణయించుకున్న చంద్రబాబు
బడ్జెట్ లో ఏపీని పట్టించుకోకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసహనంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవాలని నిర్ణయించుకున్నారు. విభజన నేపథ్యంలో ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాల్సిందేనంటున్న బాబు, దీనిపై మోదీని గట్టిగా అడిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంలో మోసపోయామనే భావన అటు ప్రజల్లోనూ, ఇటు నేతల్లోనూ ఇప్పుడిప్పుడే పొడసూపుతోంది. ప్రత్యేక హోదా అంశం విభజన చట్టంలో లేదని బీజేపీ అంటుండగా... తాము ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేశామని అందుకు క్యాబినెట్ ఆమోదం కూడా లభించిందని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, హోదా సాధించలేకపోతే ప్రజల్లో నమ్మకం సడలిపోయే ప్రమాదముందన్నది చంద్రబాబుకు తెలియందికాదు. అందుకే ఆయన బడ్జెట్ పై ఆలస్యంగా స్పందించినా, కాస్త ఘాటుగానే మాట్లాడారు. టీడీపీ ఎన్డీయేలో భాగస్వామ్య పక్షమైనాగానీ బడ్జెట్ లో కేటాయింపులు లేకపోవడం బాబును తీవ్రంగా నిరాశపరిచింది.