: తిరుపతిలో మోదీ ఏం చెప్పారు?... ఇప్పుడేం చేశారు?: చంద్రబాబు అసహనం


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీపై కూడా సుతిమెత్తగా విమర్శలు సంధించారు. ఎన్నికల ప్రచార సమయంలో రాష్ట్రం విడిపోవడంపై ఎంతో బాధను వ్యక్తం చేసిన మోదీ... ఏపీకి ఢిల్లీ స్థాయి రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడేమో బడ్జెట్లో దాని ఊసే లేదని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయని... ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం కలగజేసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని అన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏం పట్టనట్టు వ్యవహరిస్తోందని... చివరకు, తానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి కొంత మేర సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నం చేశానని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ తరహాలో అభివృద్ధి చెందేంతవరకు ఏపీకి సహాయం చేయాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాజధాని అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడం ఏమిటని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరిగిందని, అందులో బీజేపీ పాత్ర కూడా ఉందని... అందువల్ల ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉందని స్పష్టం చేశారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నానని, పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని... ఏం చేస్తే ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసని చెప్పారు. ఢిల్లీలో ప్రతి విషయం కూడా చాలా గోప్యంగా జరుగుతోందని, ఏం జరగబోతోందో కూడా అర్థం కావడం లేదని... పరిస్థితి ఇలాగే కొనసాగితే, భవిష్యత్తులో తీవ్ర సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. హుదూద్ తుపాను వల్ల రూ. 61 వేల కోట్ల నష్టం వాటిల్లిందని మరోసారి చెప్పారు. ఏదేమైనప్పటికీ, జరిగిన అన్యాయంపై, జరగాల్సిన న్యాయంపై పాజిటివ్ గా ఆలోచించండి, పాజిటివ్ గా స్పందించండని హితవు పలికారు.

  • Loading...

More Telugu News