: 'కేసీఆర్ విత్ యూ' అనే విషయం మరచిపోవద్దు: కేసీఆర్


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. హైదరాబాదు నగర ప్రజలు ఇకపై సెటిలర్ అనే పదానికి దూరంగా ఉండాలని అన్నారు. ప్రాంతీయ విభేదాలను పక్కనబెట్టాలని సూచించారు. హైదరాబాదీలమని కాలర్ ఎగరేసి చెప్పుకోవచ్చని పేర్కొన్నారు. కేసీఆర్ విత్ యుూ అనే విషయం మరచిపోవద్దని అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ ధనిక రాష్ట్రం అవుతుందని ఎప్పుడో చెప్పానని అన్నారు. తాజాగా 14వ ఆర్థిక సంఘం కూడా అదే చెప్పిందన్నారు. తెలంగాణలో ఎక్కడా కరెంటు కోతలు మొదలుకాలేదని స్పష్టం చేశారు. అయితే, వేసవిలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. 2018 తర్వాత పుట్టేవారికి కరెంటు కొరత అంటే తెలియని విధంగా ప్రణాళిక బద్ధంగా వ్యవహరిస్తామని చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ సహకరించడంలేదని కేసీఆర్ ఆరోపించారు. లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలను కేంద్రం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రైల్వే బడ్జెట్ లో ఒక్క విషయం సంతోషంగా ఉందన్నారు. పెద్దపల్లి రైల్వే లైన్ కు నిధులు కేటాయించడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో సికింద్రాబాదును కూడా చేర్చినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News