: గాడిదలను రంగంలోకి దింపిన ఇసుక మాఫియా
తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇసుక మాఫియాపై కఠిన చర్యలకు ఉపక్రమించడం తెలిసిందే. దీంతో, తెలంగాణ రాష్ట్రంలోని ఇసుక మాఫియా సాధారణంగా ఉపయోగించే ట్రాక్టర్లు, లారీల స్థానంలో గాడిదలను రంగంలోకి దింపింది. మెదక్ జిల్లాలోని మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లాలోని ఎల్గోయ్ ప్రాంతం వరకు ఈ వినూత్న దందా నడుస్తోంది. వాహనాలు నది మధ్య భాగంలోకి వెళ్లలేకపోవడం, అధికారుల నిఘా ఎక్కువ కావడంతో ఇసుక అక్రమ రవాణాదారులు ఇలా గాడిదలతో ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో గాడిదపై 60 కిలోల ఇసుక తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు ఇసుక వ్యాపారులు రూ.800 దాకా చెల్లిస్తున్నారు. ఈ దందా కోసం పొరుగు రాష్ట్రాల నుంచి కూడా గాడిదలను తీసుకువస్తున్నారట.