: మహిళపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం
కంచే చేను మేసేందుకు ప్రయత్నించింది. అత్యాచారాల నుంచి రక్షణ కల్పించాల్సిన కానిస్టేబుల్ ఓ మహిళపై అత్యాచారయత్నం చేసిన ఘటన సంచలనం రేపింది. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని దొమ్మాయిగూడ గ్రామానికి కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ వచ్చాడు. మాట్లాడాలనే వంకతో పరిచయం ఉన్న ఓ మహిళను ఆటోలో గోధుమకుంట-చేర్యాల మధ్యనున్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. దీంతో సదరుమహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని, అతనిని పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి కీసర పోలీసులకు అప్పగించారు. ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.