: భూసేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకిస్తున్న విపక్షాలపై విరుచుకుపడ్డ మోదీ
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్, బిల్లుపై విపక్షాలు కొన్ని రోజులుగా వ్యతిరేకత వ్యక్తం చేయడంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. లోక్ సభలో రాష్ట్రప్రతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపక్షాలపై నిప్పులు చెరిగారు. భూసేకరణ లేకపోతే మౌలిక సదుపాయాల కల్పన సాధ్యం కాదన్నారు. ఈ చట్టంపై ప్రస్తుతం చాలా చర్చ జరుగుతోందన్నారు. తామొక పనిచేశామని, అయితే ప్రపంచంలో ఇంతకంటే ఎవరూ చేయలేరనే అహంకారం ఉండకూడదన్నారు. 1894 నాటికి భూసేకరణ చట్టంలో మార్పులు చేయడానికి 2013 వరకు అంటే 120 ఏళ్ల సమయం పట్టిందా? అని ప్రశ్నించారు. రైతులకు నష్టం జరుగుతుందని ఇంతకాలం అధికారంలో ఉన్నవారికి గుర్తుకు రాలేదా అని ఆయన సూటిగా అడిగారు. కానీ ఈరోజు చట్టంలో మార్పులు చేయకూడదంటూ రాజకీయాలు చేస్తారా? అని విపక్షాలపై ధ్వజమెత్తారు. యూపీఏ విధానాలు, చేసిన చట్టాలు మంచివైతే ప్రజలెందుకు ఓడించారని నిలదీశారు. పశ్చిమ భారతంలోని గ్రామాల్లో ఎంతోకొంత మౌలిక సదుపాయాలున్నాయని, కానీ తూర్పు భారతంలో కనీసం సౌకర్యాలు లేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. అందుకే భూసేకరణ చట్టం ఏర్పాటుచేసిన గౌరవం వాళ్లకే ఇద్దామని ప్రధాని చెప్పారు. పశ్చిమబెంగాల్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలన్నింటినీ అభివృద్ధి పథంలోకి తీసుకురావాలన్న మోదీ, అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా ఆ రాష్ట్రాలను కూడా చూడాల్సి ఉందని స్పష్టం చేశారు.