: మొన్నటి భారత్-పాక్ క్రికెట్ మ్యాచ్ ను ఎంతమంది చూశారో తెలుసా?
ప్రపంచ కప్-2015లో భాగంగా ఈ నెల 15న భారత్, పాకిస్థాన్ ల మధ్య జరిగిన హైఓల్టేజీ మ్యాచ్ ను చూసిన వారి సంఖ్య ఎంతో తెలుసా? తెలిస్తే, నోరెళ్లబెట్టక తప్పదు. టీమిండియా, పాక్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ అంటే... అది ఏ సిరీస్ అయినా, ఏ వేదికైనా అభిమానులు పోటెత్తడం ఖాయమే. ఇక వరల్డ్ కప్ లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే, మాటలు కాదుగా. అందుకేనేమో ఏకంగా ఈ మ్యాచ్ ను 28.8 కోట్ల మంది వీక్షించారు. అది కూడా ఒక్క భారత్ లోనే సుమా. క్రికెట్ లో ఏ మ్యాచ్ లకు దక్కని అరుదైన అభిమానం ఈ మ్యాచ్ కు పోటెత్తింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ను ఇంతకంటే కాస్త ఎక్కువ మందే వీక్షించినా, అది ఫైనల్ మ్యాచ్ కాబట్టి సగటు భారతీయులు ఆసక్తి కనబరిచారనుకోవచ్చు. అయితే మొన్న జరిగిన మ్యాచ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా కాదాయే. అయినా భారత్, పాక్ ల మధ్య కొనసాగుతున్న చిరకాల వైరం నేపథ్యంలో ఈ దేశాలకు చెందిన రెండు జట్ల మధ్య మ్యాచ్ పట్ల ఒక్క భారత్ లోనే కాదండోయ్, ప్రపంచవ్యాప్తంగానూ ఆసక్తే. ఇంతటి అభిమానం పోటెత్తిన ఈ మ్యాచ్ లో భారత్ పాక్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగించి ఘనవిజయం సాధించింది. మ్యాచ్ కు వెల్లువెత్తిన అభిమానంతో స్టార్ టీవీ యాజమాన్యం సంబరాల్లో మునిగిపోయింది. తదుపరి మ్యాచ్ లను మరింత మెరుగ్గా చూపేందుకు యత్నిస్తామని స్టార్ టీవీ ప్రకటించింది.