: ప్రేమించినందుకు ఆమెపై క్షుద్ర పూజలు... భయంతో హెయిర్ డై తాగి ఆత్మహత్య చేసుకున్న యువతి!
ప్రియుడితో కలసి ఉండలేనని భావించిన యువతి, ఆరు పేజీల సుదీర్ఘ లేఖను రాసి తల వెంట్రుకలు నల్లగా మారేందుకు వినియోగించే ఆయిలును తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాదు శివారు హయత్‌నగర్ మండలం బాటసింగారం సమీపంలోని కొత్తగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కొత్తగూడెంకు చెందిన ఎం.డి.సాధిక్ కూతురు 22 ఏళ్ల మెహరాజ్ (సోని) తన ఇంటికి ఎదురుగా వుండే సాగర్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఆమె రాసినట్టుగా భావిస్తున్న లేఖ ప్రకారం, తన చావుకు సాగర్ తల్లిదండ్రులు, ఇతర బంధువులు కారణమని పేర్కొంది. 'సాగర్, నేను ప్రేమించుకున్నాం. విషయం అతని ఇంట్లో తెలుసు. వారు పెళ్లికి ఒప్పుకున్నారు. సాగర్ తల్లిదండ్రులు మంత్రాలు చదువుతూ క్షుద్రపూజలు చేస్తారు. పలుమార్లు నన్ను పూజల్లో కూర్చోమంటూ ఒత్తిడి చేశారు. 3 నెలలపాటు తమతోనే రావాలన్నారు. మహిమలతో నా తల్లిదండ్రులను సైతం పెళ్లికి ఒప్పిస్తామంటూ నమ్మబలికారు. క్షుద్రపూజలకు సహకరించను అంటే, నా కుటుంబానికి హాని చేస్తామంటూ బెదిరించారు. సాగర్ ను, నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు. వాళ్లు చేసే పనులకు నన్ను బలి చేయాలనుకున్నారు. వారి నీచపు పనుల గురించి బయట చెబుతానేమోనని చంపుతామని కూడా బెదిరించారు. వాళ్లను పోలీసులు శిక్షించాలి. నా చావుకు నోముల నర్సింహ ఆయన భార్య, ఆయన షడ్డకుడు కారణం' అంటూ వివరించింది. ఈ లేఖ ఆధారంగా నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.