: లిఫ్ట్ పేరిట యువతులకు విశాఖ మృగాడి వల... ఎన్జీఓ చొరవతో అరెస్ట్ చేసిన పోలీసులు
అతడో ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్. కారులో చక్కర్లు కొడుతూ లిఫ్ట్ పేరిట యువతులకు వల విసరడమే పని. అతడి మాయమాటలు నమ్మి కారు ఎక్కే యువతులు అతడి వేధింపులకు బలి కావాల్సిందే. అంతేకాక కారులో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసిన అతడు తన దుశ్చర్యను రికార్డు చేసేస్తాడు. వాటితో బాధిత యువతులకు నిత్యం వేధింపులు తప్పవు. లైంగిక వేధింపులతో పాటు డబ్బు గుంజడం కూడా అతడికి అలవాటు. విశాఖలో గత కొంతకాలంగా అలెక్స్ అనే మృగాడు సాగిస్తున్న వేధింపుల పరంపరకు నేటి ఉదయం చెక్ పడింది. కెన్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఓ యువతి అతడిని పోలీసులకు ఎట్టకేలకు పట్టించింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అలెక్స్ దారుణాలను పోలీసులు వెలికితీస్తున్నారు. అంతేకాక పక్కాగా ఆధారాలు లభించడంతో అతడిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.