: నా స్టైల్ నాదే' అంటున్న కాంగ్రెస్ నేత!
"నా స్టైల్ నాది. నన్ను మరొకరితో పోల్చవద్దు" అంటున్నారు తెలంగాణ అసెంబ్లీలో విపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టడంలో తనది మెతక వైఖరి అంటూ వస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరిస్తానని, ఎవరి కోసమో తాను దూకుడుగా వ్యవహరించబోనని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్ స్పందించాలని, ఈ విషయమై న్యాయ పోరాటం చేస్తున్నామని జానారెడ్డి వివరించారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణపై శాసనసభాపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మంత్రి జగదీశ్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలపై టీఆర్ఎస్ ప్రభుత్వం తక్షణం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.