: కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులపై అసంతృప్తిని వ్యక్తం చేసిన చంద్రబాబు
14వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆర్థిక సంఘం కేవలం రెవెన్యూ లోటును మాత్రమే భర్తీ చేసిందని అన్నారు. చిత్తూరు జిల్లాలోని సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మరోవైపు, ఆర్థిక సంఘం సిఫార్సులను కొన్నింటిని బాబు స్వాగతించారు. అయితే కేంద్రం నుంచి రాష్ట్రాలకు గణనీయంగా నిధులు పెంచారని, 42 శాతం నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు కింద ఐదేళ్లలో రాష్ట్రానికి రూ.22,113 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోటీగా ఏపీ అభివృధ్ధికి కేంద్రం సహకరించాలని, కేంద్రం ఆర్థిక సాయం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదని బాబు స్పష్టం చేశారు. 2013 జనాభా లెక్కల ఆధారంగా నిధులు కేటాయించారన్న సీఎం, కేంద్రం రూ.22 వేల కోట్లు ఇచ్చినా ఏపీకి మిగులు ఉండదని వివరించారు.