: నా ప్రాణాలకు ప్రమాదం... హిమాచల్ సర్కారుకు ప్రియాంకాగాంధీ లేఖ
తన ఆస్తిపాస్తుల వివరాలు బయటకు చెబితే ప్రాణాలకు ప్రమాదం కలగొచ్చని సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీ భయపడుతున్నారు. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ సర్కారుకు ఆమె ఒక లేఖ కూడా రాశారు. "నా ఆస్తుల వివరాలు బయటపడితే నా ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. దయచేసి, ఆ వివరాలు రహస్యంగా ఉంచండి" అని ప్రభుత్వాన్ని ఆమె కోరారు. హిమాచల్ లో ప్రియాంక ఆస్తులు సమకూర్చుకోవడం వివాదాస్పదమైన నేపథ్యంలో, రాష్ట్రంలో ఆమెకున్న ఆస్తుల వివరాలు చెప్పాలంటూ దేబాశిష్ భట్టాచార్య అనే వ్యక్తి సమాచార హక్కు కింద కోరారు. ఆమెకు రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, వాటి సేల్ డీడ్స్, డాక్యుమెంట్లు, పవర్ ఆఫ్ అటార్నీ తదితర వివరాలు అడిగారు. గత ఏడాది భట్టాచార్య పెట్టుకున్న ఈ దరఖాస్తుపై అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిన అనంతరం, అక్కడి అధికారులు ప్రియాంక ఆస్తుల వివరాలు వెల్లడించేందుకు ససేమిరా అన్నారు. ప్రియాంక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతా పరిధిలో ఉన్నందున ఆమె ఆస్తుల గురించి బయటికి చెప్పలేమని తేల్చేశారు. అంతకుముందే ప్రియాంక లేఖ రాసినట్టు తెలుస్తోంది.