: రోహిత్ డబుల్ సెంచరీలే నాకు ప్రేరణ: గేల్
టీమిండియా బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ నమోదు చేసిన 2 డబుల్ సెంచరీలే తనకు ప్రేరణ అని వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ తెలిపాడు. నేడు జింబాబ్వేతో మ్యాచ్ లో విరుచుకుపడిన గేల్ (215) వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయడం తెలిసిందే. మ్యాచ్ అనంతరం ఈ లెఫ్ట్ హ్యాండర్ మాట్లాడుతూ, వన్డే కెరీర్లో మొదటి డబుల్ సెంచరీ సాధించడం పట్ల సంతోషిస్తున్నానని తెలిపాడు. రోహిత్ శర్మ రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసినప్పటి నుంచీ డబుల్ సెంచరీ సాధించేందుకు తహతహలాడానని వివరించాడు. ఆరంభంలో కొంచెం నిదానంగా ఆడినా, ఆ తర్వాత బ్యాట్ ఝుళిపించానని వివరించాడు. ఇటీవలి ఫాం దృష్ట్యా జింబాబ్వేపై ఇన్నింగ్స్ సంతృప్తి కలిగించిందని పేర్కొన్నాడు. ఇక, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ పై దృష్టిపెట్టామని గేల్ తెలిపాడు.