: మాయావతిని తప్పుగా సంబోధించి... వెంటనే సర్దుకున్న డిప్యూటీ ఛైర్మన్ కురియన్
భూ సేకరణకు సంబంధించిన ఆర్డినెన్స్ పై రాజ్యసభలో హాట్ హాట్ గా చర్చ కొనసాగుతోంది. పారిశ్రామికవేత్తలకు లబ్ధి కలిగించేందుకే ఈ ఆర్డినెన్స్ తెచ్చారని కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ ఈ సందర్భంగా ఆరోపించారు. ఆయనకు వత్తాసు పలుకుతూ జేడీయూ నేత శరద్ యాదవ్ కూడా కేంద్రాన్ని ఎండగట్టే ప్రయత్నం చేశారు. ఆర్డినెన్స్ ల పేరుతో సభను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీతో పాటు, విపక్షాలు చేయడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ క్రమంలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ కలగజేసుకుంటూ... సభలో గందరగోళం సృష్టించరాదంటూ సభ్యులను కోరారు. అనంతరం, బీఎస్పీ అధినేత్రి మాయావతిని మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో, ఆమెను 'కుమారి' మాయావతి అనకుండా 'శ్రీమతి' మాయావతి అంటూ సంబోధించారు. ఆ తర్వాత వెంటనే సర్దుకుని 'కుమారి మాయావతి మీరు మాట్లాడండి' అంటూ సభను కొనసాగించారు. కురియన్ సంబోధనతో సభలో నవ్వులు వెల్లి విరిశాయి.