: పాక్ జట్టు ఘోర పరాజయంపై విచారణ జరపండి: లాహోర్ కోర్టులో పిటిషన్
వరల్డ్ కప్ లో పాకిస్థాన్ జట్టు చెత్త ప్రదర్శనపై ఆ దేశ అభిమానులు ఇప్పట్లో శాంతించేలా లేరు. భారత్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ ఓడిపోయిన రోజు టీవీలను పగులగొట్టిన పాక్ అభిమానులు, ఆ తర్వాతి మ్యాచ్ లోనూ జట్టు ఓటమి పాలు కావడంతో ఏకంగా రోడ్డెక్కారు. జట్టు సభ్యుల దిష్టిబొమ్మలకు శవయాత్రలు చేసి, అంత్యక్రియలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయినా వారి కోపం తగ్గనట్టుంది. జట్టు పరాజయంపై సమగ్ర విచారణ జరపాలంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నిన్న లాహోర్ హైకోర్టులో ఆ దేశ న్యాయవాది, క్రికెట్ అభిమాని రిజ్వాల్ గుల్ పిటిషన్ దాఖలు చేశారు. దేశ ప్రధాని నవాజ్ షరీఫ్, పీసీబీ చీఫ్ షహర్యార్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ నజామ్ సేథీలను ఆయన తన పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై కోర్టు నేడు విచారణ చేపట్టనుంది.