: ఊళ్లో రౌడీయిజం, రాజకీయం... స్మగ్లర్ గంగిరెడ్డిది ఆది నుంచీ నేర చరిత్రే!
కొల్లం గంగిరెడ్డి... ఎర్రచందనం అక్రమ రవాణాలో చేయి తిరిగిన స్మగ్లర్. ఏపీ పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన అతడు, ఎట్టకేలకు నిన్న మారిషస్ విమానాశ్రయంలో ఇంటర్ పోల్ పోలీసుల చేతికి చిక్కిన సంగతి తెలిసిందే. అతడి ప్రస్థానం గురించి పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూస్తున్నాయి. తొలుత రౌడీయిజం చేసిన అతడు ఆ తర్వాత రాజకీయం అండతో స్మగ్లర్ గా అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తీరు పోలీసు వర్గాలనే షాక్ కు గురి చేస్తోంది. కడప జిల్లా పుల్లంపేటకు చెందిన గంగిరెడ్డిపై జిల్లాలో రౌడీ షీట్ కూడా ఉంది. తొలుత సొంతూరులో రౌడీయిజం చేసిన గంగిరెడ్డి, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం తన సోదరుడు బ్రహ్మానందరెడ్డిని తెరముందుకు తెచ్చి, వ్యవహారం నడిపాడు. బ్రహ్మానందరెడ్డికి పలు పదవులు దక్కడంలో గంగిరెడ్డిదే ప్రధాన భూమిక అన్న విషయం జగమెరిగిన సత్యమే. ఆ తర్వాత రాజకీయ అండతోనే ఎర్రచందనం స్మగ్లింగ్ ప్రారంభించిన గంగిరెడ్డి, చెన్నై కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న ఓ అంతర్జాతీయ స్మగ్లర్ తో పరిచయం పెంచుకున్నాడు. ఆ తర్వాత గంగిరెడ్డి ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించి కోట్లాది రూపాయలు ఆర్జించాడు. కర్నూలు జిల్లా పోలీసులకు చిక్కినా, బెయిల్ పై విడుదలై, తన చుట్టూ ఉచ్చు బిగిస్తోందని తెలుసుకుని విదేశాలకు పారిపోయాడు. విదేశాల్లోనూ తన స్థావరాలు మారుస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నిన్న మారిషస్ నుంచి శ్రీలంక వెళ్లే ప్రయత్నంలో ఎయిర్ పోర్టులో పోలీసులకు పట్టుబడ్డాడు.