: ఫెదరర్ పై పాక్ అభిమానుల గుస్సా
టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ ను ఓ ఫోటో ఇబ్బందుల్లోకి నెట్టింది. ఫెదరర్ ఫోటో పాక్ అభిమానులకు కంటగింపుగా మారింది. దీంతో ఫెదరర్ తమను మోసం చేశాడంటూ వాపోయారు. భారత్ కు ఫెదరర్ మద్దతివ్వడం సరికాదని పాక్ అభిమానులు హితవు పలుకుతున్నారు. నైక్ స్పోర్ట్స్ దుస్తులకు రోజర్ ఫెదరర్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదే బ్రాండ్ టీమిండియాను కూడా స్పాన్సర్ చేస్తోంది. దీంతో భారత జెర్సీని పట్టుకుని ఫెదరర్ సంతోషంగా చూస్తున్న ఫోటోలను నైక్ సామాజిక మాధ్యమాల్లోకి అప్ లోడ్ చేసింది. ఈ ఫోటో పాక్ లోని ఫెదరర్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. దీనిపై ఫెదరర్ వివరణ ఇస్తూ తాను భారత్ కు మద్దతు ఇవ్వడం లేదని చెప్పాడు. తాను సౌతాఫ్రికాకు మద్దతిస్తానన్న విషయం అందరికీ తెలిసిందేనని వెల్లడించాడు. తనకు టీమిండియాలో చాలా మంది మిత్రులు ఉన్నారని, వారు తనకు ఆ టీ షర్టు ఇచ్చారని చెప్పాడు. ఈ ఫోటో అభిమానుల మధ్య ఘర్షణకు దారితీయడం సరికాదని ఫెదరర్ హితవు పలికాడు. దీని పట్ల ఇరుదేశాల అభిమానులకు క్షమాపణలు కోరుతున్నానని ఫెడెక్స్ అన్నాడు.