: టీవీలకు అతుక్కుపోయిన బాలీవుడ్... క్రికెట్ కోసం మాత్రం కాదు!
ఇండియాలో అత్యధికమంది నిద్రపోతున్న వేళ బాలీవుడ్ మాత్రం మేలుకొంది. టీవీలకు అతుక్కుపోయింది. బాలీవుడ్ ప్రముఖులు నేటి వేకువజాము నుంచి టీవీ చూస్తూ కూర్చుండి పోయారు. అదేంటి, క్రికెట్ మ్యాచ్ నిన్ననే అయిపోయింది, మరో మ్యాచ్ కూడా లేదు కదా అనుకుంటున్నారా? క్రికెట్ కోసం కాదండీ... 87వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని వీక్షించడం కోసం. కునాల్ ఖేము, సోహా అలీ ఖాన్, సోఫీ చౌదరీ, నేహాశర్మ, మిలాప్ జవేరీ, దియా మిర్జా, దీపా మెహంతా తదితర సెలబ్రిటీలు ఎవరెవరికీ అవార్డులు దక్కుతాయోననే ఉత్కంఠతో నిద్రలేచి టీవీలను అతుక్కుపోయారు. అంతేకాదు 'లేండి.. మేలుకోండి.. ఆస్కార్ అవార్డుల వేడుకను వీక్షించండి. మీకు నచ్చిన వాళ్లకు అవార్డు వస్తే రెచ్చిపోయి ఈలలు వేసి గోలగోల చేయండి' అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు కూడా పెట్టారు. సినిమా వాళ్లు, సినిమా అవార్డుల పండగ... అంతేమరి!