: తెలుగుభాషను తెలుగువాళ్లే రక్షించుకోవాలి: మండలి బుద్ధ ప్రసాద్


అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం జరుపుకోవడం మన అదృష్టమని డిప్యూటీ స్పీకర్, కృష్ణాజిల్లా తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. విజయవాడలో జరుగుతున్న మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. మహోన్నతమైన తెలుగు భాషకు మనం వారసులం అని గుర్తుంచుకోవాలన్నారు. 'దేశభాషలందు తెలుగులెస్స', 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా మన భాష ప్రసిద్ధి చెందిందని మండలి గుర్తు చేశారు. రాష్ట్రంలోని నామఫలకాలన్నీ తెలుగులోనే రాయాలని కోరుతున్నానన్నారు. విదేశాల నుంచి వచ్చిన రచయితలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తెలుగుభాషను తెలుగువాళ్లే రక్షించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తెలుగు అక్షరాలు రాకుండా పట్టభద్రులయ్యే దురదృష్టం మన రాష్ట్రంలో ఉందని, విద్యావిధానంలో ఇలాంటి దౌర్భాగ్యం పోవాలని కోరుకుంటున్నానని చెప్పారు. తెలుగులోనూ సంక్షిప్త సందేశాలు ఇచ్చే సౌలభ్యం వచ్చిందని, గూగుల్, వెబ్ సైట్లలోనూ తెలుగుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. మాతృ భాషకు ఏ మేరకు సేవ చేయగలమని ఆలోచించాలన్న బుద్ధ ప్రసాద్, తెలుగు సాహిత్యాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు యువ రచయితలు నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News