: గూఢచర్యం కేసులో రిలయన్స్ ఉద్యోగి అరెస్ట్... పడిపోయిన షేర్ విలువ
కార్పొరేట్ గూఢచర్యానికి పాల్పడ్డాడన్న అభియోగాలతో రిలయన్స్ ఉద్యోగి ఒకరిని గత రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చమురు మంత్రిత్వ శాఖకు చెందిన కీలక పత్రాలను దొంగిలించి కార్పోరేట్ కంపెనీలకు అందించాడన్నది ఇతనిపై ప్రధాన అభియోగం. చమురు ఎగుమతి, దిగుమతులు, కొత్త చమురు బావుల కేటాయింపు విధానాలు వంటి రహస్య దస్త్రాలను బయటకు చేరవేసిన వారిలో ఇతను కూడా ఉన్నాడని తెలుస్తోంది. ఉద్యోగి అరెస్ట్ విషయాన్ని రిలయన్స్ ప్రతినిధి ఒకరు స్పష్టం చేశారు. తమ ఉద్యోగి అరెస్ట్ నిజమేనని, మరిన్ని వివరాలు తనకు తెలియదని, అంతర్గత విచారణ జరుగుతోందని ఆయన తెలిపారు. కాగా, ఈ వార్త ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయడంతో, నేటి స్టాక్ మార్కెట్లో రిలయన్స్ వాటా విలువ పడిపోయింది. ఉదయం 11:50 గంటల సమయంలో రిలయన్స్ వాటా విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 2.17 శాతం తగ్గి రూ.881 వద్ద కొనసాగుతోంది.