: మంత్రి పదవి కావాలా?... నా వద్దకు రండి: నేటి బల పరీక్షకు మాంఝీ సమాయత్తం


బీహార్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి నేడు తెరపడనుంది. పదవి నుంచి దిగిపొమ్మన్న జేడీయూ అధిష్ఠానంపై తిరగబడ్డ ఆ రాష్ట్ర సీఎం జితన్ రామ్ మాంఝీ నేడు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోనున్నారు. ఇప్పటికే తన రాజకీయ చతురతతో బీజేపీ మద్దతు కూడగట్టిన మాంఝీ, జేడీయూకి చెందిన పలువురు ఎమ్మెల్యేలనూ తన వైపు లాక్కొన్నట్లు తెలుస్తోంది. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలనూ మాంఝీ వినియోగించారు. ‘‘మీకు మంత్రి పదవి కావాలా? అయితే నా వద్దకు రండి’’ అంటూ ఆయన నిన్న తుది యత్నం చేసేశారు. ఈ పిలుపునకు ఎంతమంది ఆయన బుట్టలో పడ్డారన్న విషయం నేటి అసెంబ్లీలో జరిగే ఓటింగ్ లో కాని తేలదు. మరోవైపు ఈ అనిశ్చితికి కారణమైన నితీశ్ కుమార్ బలం క్రమంగా తగ్గుతోంది. ఆ పార్టీ టికెట్లపై గెలిచి మాంఝీకి మద్దతు పలికిన ఏడుగురు మంత్రులపై ఆయన వేటేశారు. అంతేకాక వారిని ఓటింగ్ కు దూరంగా ఉంచేలా హైకోర్టు నుంచి తీర్పును తెచ్చుకోగలిగారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో మాంఝీ భేటీ నేపథ్యంలో బీజేపీ, బీహార్ సీఎంకు బహిరంగ మద్దతు ప్రకటించే అవకాశాలున్నాయి. నేడు అసెంబ్లీలో జరగనున్న విశ్వాస పరీక్షకు సంబంధించి విప్ జారీ చేసిన ఆ పార్టీ, మాంఝీకి మద్దతు పలకాలని తన పార్టీ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో మాంఝీ విశ్వాస పరీక్షలో నెగ్గడం ఖాయంగానే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News