: పసికూనలైనా సత్తాచాటిన యూఏఈ... కష్టపడి గెలిచిన జింబాబ్వే
రెండు జట్లూ చిన్నవే. అయితేనేం జింబాబ్వేకు అపార అనుభవం ఉంది. ఎన్నోమార్లు పెద్ద జట్లకు సవాళ్లు విసిరింది. జింబాబ్వేతో పోలిస్తే, ఎంతో చిన్న జట్టుగా చెప్పుకోవాల్సిన యూఏఈ నెల్సన్ లో నేడు జరిగిన క్రికెట్ పోటీలో ఆ జట్టుకు చమటలు పట్టించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. ఇద్దరు మినహా జట్టు మొత్తం సమష్టిగా రాణించడం గమనార్హం. ఆటగాళ్లంతా 20 పరుగుల పైగా సాధించగా, షిమన్ అన్వర్ 67 పరుగులతో రాణించాడు. 286 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే నిదానంగా ఇన్నింగ్స్ నిర్మించింది. తొలి వికెట్ కు 64 పరుగులు జోడించిన తరువాత కాస్త తడబడింది. ఒక దశలో మ్యాచ్ యూఏఈ చేతుల్లోకి పోతున్నట్టు అనిపించినా, సీన్ విలియమ్స్ కుదురుగా ఆడి, మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. 48 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసిన జింబాబ్వే, 4 వికెట్ల తేడాతో గెలిచింది.