: ఆఫ్ఘన్ పై బంగ్లాదేశ్ ఘనవిజయం
ఆస్ట్రేలియాలోని కాన్ బెర్రాలో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు ఆఫ్ఘనిస్థాన్ పై 105 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. 268 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఆఫ్ఘన్ కూనలు 42.5 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటయ్యారు. ఆ జట్టులో కెప్టెన్ మహ్మద్ నబి (44) టాప్ స్కోరర్. సమియుల్లా షెన్వారీ 42 పరుగులతో రాణించాడు. మిగతా బ్యాట్స్ మెన్ విఫలం కావడంతో ఆఫ్ఘన్ జట్టుకు ఓటమి తప్పలేదు. బంగ్లా బౌలర్లలో మొర్తజాకు 3 వికెట్లు దక్కాయి. షకిబ్ అల్ హసన్ 2 వికెట్లు తీశాడు. అంతకుముందు, టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీం (71), షకిబ్ అల్ హసన్ (63) బ్యాట్లకు పనిచెప్పారు. అటు, ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి బంగ్లా బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశారు. దీంతో, బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది.