: పాక్ బోటు పేలుడుపై ఇరకాటంలో కేంద్రం... మరికాసేపట్లో మీడియా ముందుకు పారికర్
గుజరాత్ తీరం వద్దకు చొచ్చుకువచ్చిన పాకిస్థాన్ బోటు పేలుడుపై మోదీ సర్కారు ఇరకాటంలో పడింది. నాటి ఘటనలో బోటులోని ఉగ్రవాదులే తమ బోటును పేల్చేసుకున్నారని నాడు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ బోటును తామే పేల్చేశామని, లేదంటే పాక్ ఉగ్రవాదులకు బిర్యానీలు పెట్టాల్సి వచ్చేదని గుజరాత్ కోస్ట్ గార్డ్ డీఐజీ లోషాలి వెల్లడించినట్లు తాజాగా ఓ ఆంగ్ల దినపత్రిక ఓ కథనాన్ని రాసింది. దీంతో ఈ విషయంలో కేంద్ర సర్కారు ఇరకాటంలో పడిపోయింది. ఇదిలా ఉంటే, ఆంగ్ల పత్రిక కథనం అవాస్తవమని, తన వ్యాఖ్యలను సదరు పత్రిక వక్రీకరించిందని లోషాలి కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అనవసర రాద్ధాంతానికి తెర దించేందుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.